ఇద్దరూ 12వ తేదీని వదిలేస్తున్నారట!!

ప్రస్తుతం సినీప్రియులతో పాటు సినీవర్గాల దృష్టీ సంక్రాంతి సీజన్‌పైనే ఉంది. ఈ ముగ్గుల పండక్కి ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురములో’, ‘దర్బార్‌’ వంటి బడా చిత్రాలతో పాటు ‘ఎంత మంచివాడవురా’ అనే మరో మీడియం బడ్జెట్‌ చిత్రమూ రేసులో నిలిచాయి. కానీ, వీటన్నింటి కన్నా సినీప్రియులు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది మహేష్, అల్లు అర్జున్‌ చిత్రాల కోసమే. అయితే వీళ్లిద్దరూ జనవరి 12నే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలా ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే రోజు థియేటర్లలోకి వస్తే చిత్ర వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో.. ఇరు చిత్ర బృందాలు తేదీలు మార్పుపై చర్చలు జరుపుకుంటున్నాయి. ఇప్పటికే దీనిపై అనేక చర్చలు జరగ్గా విడుదల తేదీల విషయంలో ఇరువురికీ ఏకాభిప్రాయం కుదర్లేదు. అందుకే ఈసారి స్వయంగా నిర్మాత దిల్‌ రాజు రంగంలోకి దిగారట. తాజాగా ఆయన మహేష్‌ - బన్నిలతో ఓ రహస్య భేటి ఏర్పాటు చేసి విడుదల తేదీలపై ఓ నిర్ణయానికి వచ్చేలా చేశారట. నిన్నమొన్నటి వరకు మహేష్‌ జనవరి 11న, బన్ని 12న రానున్నట్లు గుసగుసలు వినిపించినప్పటికీ.. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరూ జనవరిని 12ని వదిలేస్తున్నారట. అయితే ముందుగా ప్రేక్షకుల్ని పలకరించేది మాత్రం అల్లు అర్జునే. ఆయన తన చిత్రాన్ని జనవరి 11న థియేటర్లలోకి తీసుకురానున్నారట. సూపర్‌స్టార్‌ రెండు రోజుల తర్వాత జనవరి 13న ప్రేక్షకుల్ని పలకరిస్తారట. ఇక వీళ్లందరి కన్నా ముందుగా పండగకి వచ్చేది రజనీకాంత్‌ అట. ఆయన తన ‘దర్బార్‌’ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ.. దాదాపు ఇదే తేదీలు ఖరారయ్యే అవకాశాలున్నాయట. ఇంతకీ దిల్‌రాజు ఈ వ్యవహారంలో దూరడానికి మరో ప్రత్యేక కారణమూ ఉంది. ఆయన ‘సరిలేరు’కులో సహ నిర్మాతగా వ్యవహరిస్తూనే ‘అల.. వైకుంఠపురములో’ నైజాం హక్కులను తీసుకున్నారట. కాబట్టి ఈ రెండు చిత్రాలు ఒకేరోజున వస్తే మొదట ఇబ్బంది పడేది రాజుగారే. అందుకే తెలివిగా ఈ సమస్యను పరిష్కరించుకున్నారట.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.