ఇద్దరూ పట్టు వదలడం లేదు
సంక్రాంతికి బాక్సాఫీసు ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీ ఎదురుకానుంది. సంక్రాంతి అన‌గానే పెద్ద సినిమాల హ‌డావుడి మామూలే. అయితే ఈసారి అది ఇంకాస్త ఎక్కువ క‌నిపించ‌బోతోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు రెండూ ఒకేరోజు విడుద‌ల కాబోతున్నాయి. వీరిద్ద‌రి గురి జ‌న‌వ‌రి 12పైనే ఉంది. మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' ని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అదే రోజున అల్లు అర్జున్ సినిమా `అల.. వైకుంఠ‌పుర‌ములో` కూడా విడుద‌ల కానుంది. రెండు పెద్ద సినిమాలూ ఒకే రోజు ఢీ కోట్టుకోవ‌డం చూడ్డానికి బాగానే ఉన్నా, ఆర్థికంగా న‌ష్ట‌దాయ‌కం. ఓపెనింగ్స్ ని రెండు సినిమాలూ పంచుకోవాల్సివ‌స్తుంది. దాంతో ఇద్ద‌రు నిర్మాత‌లూ న‌ష్ట‌పోతారు. మ‌ధ్యేమార్గంగా ఓ సినిమా వెన‌క్కి వెళ్తుంద‌ని, 'స‌రిలేరు నీకెవ్వ‌రు' జ‌న‌వ‌రి 11న విడుదల అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అలా అయితే... రెండు సినిమాల‌కూ మ‌ధ్య ఓ రోజు విరామం వ‌స్తుంది. అది చాలు. రెండు సినిమాల‌కూ ప్ల‌స్ అవ్వ‌డానికి.


అయితే త‌న సినిమాని ఒక‌రోజు ముందు విడుదల చేయ‌డానికి మ‌హేష్‌బాబు ఏమాత్రం ఒప్పుకోవ‌డం లేద‌ట‌. ముందు అనుకున్న‌ట్టు 12నే విడుద‌ల చేద్దాం, కావాలంటే అల వైకుంఠ‌పుర‌ములోని 11న ర‌మ్మ‌నండి అంటున్నాడ‌ట‌. నిర్మాత‌లు ఎంత చెప్పినా మ‌హేష్ త‌గ్గ‌డం లేద‌ని, విడుద‌ల తేదీ మార్చ‌డం కుద‌ర‌దంటున్నాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు అల్లు అర్జున్ కూడా 12నే త‌న సినిమా విడుద‌ల చేయాల‌ని గ‌ట్టిగా చెబుతున్నాడ‌ట‌. మ‌రి ఇద్ద‌రూ త‌గ్గ‌క‌పోతే.. 12న క్లాష్ త‌ప్ప‌న‌ట్టే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.