ఓటీటీలో విడుదల కానున్న మాధవన్‌ ‘మారా’

ఈ మధ్యనే ‘నిశ్శబ్దం’ చిత్రంలో అలరించిన నటుడు మాధవన్‌. మరోసారి ఓటీటీ వేదికగా డిసెంబర్‌ల్లో సందడి చేయనున్నాడు. మాధవన్‌, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మారా’. తమిళ ‘కల్కి’ చిత్ర దర్శకుడు దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 17న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌, పార్వతిలు కలిసి నటించిన ‘చార్లీ’ చిత్రానికి ఈ చిత్రం రీమేక్‌. ఇంకా చిత్రంలో మౌలి, శివద, అలెగ్జాండర్‌ బాబు, మినోన్‌లు నటించారు. ప్రమోద్‌ ఫిల్మ్స్  పతాకంపై రూపొందిన సినిమాకి ప్రతీక్‌ చక్రవర్తి, శ్రుతి నల్లప్ప నిర్మాతలు. సినిమాకి గిబ్రాన్‌ సంగీత స్వరాలు అందించగా, సినిమాటోగ్రాఫర్లుగా దినేష్‌ క్రిష్ణన్‌, కార్తిక్‌లు పనిచేశారు. చిత్రం తొలుత జూన్ 18, 2018న పాండిచ్చేరిలో ప్రారంభమైంది. వారం రోజుల ముందు సినిమా రిహార్సల్ పూర్తి చేశారు. తరువాత ఈ చిత్రం ఆగిపోయింది. మాధవన్ తను దర్శకత్వంలో వహించే ‘రాకెట్ట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్ర నిర్మాణంలో ఉండిపోయారు. దాంతో సినిమా సంవత్సరానికి పైగా షూటింగ్‌ విరామం తీసుకుంది. తరువాతా అక్టోబర్ 2019లో బాల నటుడు మినోన్, హాస్యనటుడు అలెగ్జాండర్ బాబు చిత్రబృందం చేరడంతో కొచ్చిలో మళ్లీ షూటింగ్ ప్రారంభించారు. ఈ ఏడాది మధ్యలో చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌లోకి వచ్చి డిసెంబర్లో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.