మరోసారి రాంబాబుగా నాని!

కొన్ని పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. తెరపై ఆ పేరున్న పాత్రలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ సందడే చేశాడు యువ కథానాయకుడు నాని. తన తొలి చిత్రం ‘అష్టాచమ్మా’లో రాంబాబుగా కనిపించి వినోదం పంచాడు. ‘‘అసలు ప్రపంచంలో ఎన్ని మంచి పేర్లులున్నాయ్‌. ఉదాహరణకు.. రాంబాబు. రాం..బా..బు. స్వీట్‌ అండ్‌ క్యూట్‌’’ అని నాయిక స్వాతితో చెప్పే సన్నివేశంలో ఆ పేరుకున్న గొప్పతనం తెలియజేశాడు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి రాంబాబుగా దర్శనమివ్వబోతున్నాడు. నాని హీరోగా మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ‘వి’ చిత్రంలో రాంబాబు పాత్ర పోషిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన ఓ ఫొటో చూస్తుంటే ఈ విషయం అర్థమవుతుంది. ఇందులో పోలీసు దుస్తులపై జి.రాంబాబు అని ఇంగ్లిష్‌లో ట్యాగ్‌ ఉంటుంది. అంతేకాదు ‘అష్టాచమ్మా’ గుర్తుందా? అంటూ నాని వ్యాఖ్యను జోడించాడు. అష్టాచమ్మా సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్‌ కృష్ణనే ‘వి’ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఈ చిత్రంలో నాని నెగిటివ్‌ ఛాయలున్న పాత్ర పోషిస్తున్నాడు.సుధీర్‌ బాబు మరో కథానాయకుడు. నివేదా థామస్, అతిథిరావు హైదరీ నాయికలు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.