‘నిశ్శబ్దం’గా ‘భీష్మ’తో పోటీకి

‘భాగమతి’ వంటి హిట్‌ తర్వాత ఏడాదిన్నరపైగా విరామం తీసుకున్న అనుష్క.. త్వరలోనే ‘నిశ్శబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈనెల 31నే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించింది. కానీ, ఇంత వరకు ఎలాంటి ప్రచార కార్యక్రమాల హడావుడి కనిపించకపోవడంతో ఈ సినిమా వాయిదా పడటం ఖాయమని ఇప్పటికే అర్థమైపోయింది. అయితే తాజాగా చిత్రసీమలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం స్వీటీ ఈ చిత్రంతో నితిన్‌కు పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్‌ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చేస్తోన్న సంగతి తెలిసిందే. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. ఇప్పుడిదే తేదీకి ఓరోజు ముందుగా ఫిబ్రవరి 20న ‘నిశ్శబ్దం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం ప్రణాళిక రచించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క మాటలు రాని పెయింటర్‌గా కనిపించనుండగా.. ఆమెకు జోడీగా మాధవన్‌ ఆంథోని అనే అంధ మ్యుజీషియన్‌గా దర్శనమివ్వబోతున్నారు. షాలిని పాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ నటుడు మైకేల్‌ మాడిసన్‌ ప్రతినాయక పాత్రను పోషించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, ఆంగ్ల భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.