‘నిశ్శబ్దం’గా చూపించేశారు..

కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల రెండు నెలలుగా స్తంభించిన చిత్రసీమలో ఇప్పుడిప్పుడే సినీ సందడి మళ్లీ షురూ అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభం కాగా.. ఈనెలలోనే చిత్రీకరణలకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొత్త సినిమాల సందడితో థియేటర్లు కళకళలాడాలంటే మరో రెండు నెలలైన వేచి చూడక తప్పదు. ఇక థియేటర్లు తెరచుకుంటే తమ కొత్త చిత్రాలతో సందడి చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలా ముస్తాబై సిద్ధంగా సినిమాల జాబితాలో అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఉంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కోసం ప్రత్యేకంగా ఓ షో కూడా వెయ్యడం జరిగిందని సమాచారం అందుతోంది. హేమంత్‌కు పూరి మంచి స్నేహితుడు. ఆయన ఎప్పటి నుంచో ‘నిశ్శబ్దం’ చూడాలని ఆతృతతో ఉన్నారట. అందుకే పూరి కోసం హేమంత్‌ ప్రత్యేకంగా సినిమా ప్రదర్శించి ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లు తెరవడంపై ప్రభుత్వాల నుంచి స్పష్టత రాగానే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించాలని చిత్ర బృందం ఎదురు చూస్తోంది.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.