‘వకీల్‌సాబ్‌’ వెనకడుగు.. మళ్లీ రాక అప్పుడే!!

ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో మరిన్ని సినిమాల విడుదలు వాయిదా పడబోతున్నాయి. అయితే వీటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది మాత్రం అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం ‘వకీల్‌సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. ఈ చిత్రాన్ని మేలో విడుదల చెయ్యాలని ప్రణాళికలు రచించారు నిర్మాతల దిల్‌రాజు. ఈపాటికే ప్రచార పర్వాన్నీ పరుగులు పెట్టిస్తుండేవారు. కానీ, లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో.. ఈ సినిమా మిగిలి ఉన్న చిత్రీకరణ పూర్తి చెయ్యడానికి కనీసం జూన్‌ వరకైనా వేచి చూడక తప్పని పరిస్థితి ఉంది. నెమ్మదిగా జులై నాటికి చిత్రీకరణ పూర్తి చేసినా.. ఇప్పుడున్న స్థితిలో సినిమాను విడుదల చెయ్యడానికి దసరాను మించిన సీజన్‌ మరొకటి దొరకదు. అయితే ఇదంతా సెట్‌ అవ్వాలంటే దీని కన్నా ముందు ఇప్పటికే విడుదలకు సిద్ధమై ఆగిపోయిన మిగతా చిత్రాలకు సంబంధించి ఓ స్పష్టత రావాల్సి ఉంది. దీనికి తోడు ఇప్పుడున్న స్థితిలో తిరిగి థియేటర్లు తెరచుకోని మళ్లీ ప్రజలు సినిమాల వైపు చూడటానికి మరింత సమయమే పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోని ‘వకీల్‌సాబ్‌’కు ముహూర్తం ఖరారు చెయ్యాల్సి ఉంది. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.