‘ప్రభాస్‌20’ వచ్చేది అప్పుడే.. రెబల్‌స్టార్‌ క్లారిటీ

‘సాహో’ తర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అన్న అంశంపై చిత్ర నిర్మాత, ప్రభాస్‌ పెద్దనాన్న కృష్ణంరాజు నుంచి ఓ స్పష్టమైన ప్రకటన వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన తన 80వ జన్మదిన ముందస్తు వేడుకలను పురస్కరించుకోని మీడియా ముందుకొచ్చారు ఈ సీనియర్‌ రెబల్‌స్టార్‌. ఈ సందర్భంగా తన నిర్మాణంలో వస్తోన్న ‘ప్రభాస్‌ 20’ చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘‘గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌ నుంచి వచ్చే సినిమాలంటే వాటి కథ కథనాల్లో ఓ ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకుల్లో నమ్మకం ఉంది. ఆ నమ్మకాలు ఏ మాత్రం వమ్ము చేయని విధంగా ఈ సినిమా ఉండబోతుంది. ‘బాహుబలి’, ‘సాహో’లతో ప్రభాస్‌ వరుసగా యాక్షన్‌ చిత్రాలే చేశాడు. అందుకే కొత్తగా ఉండాలని ఈసారి తనని ఓ సరికొత్త ప్రేమకథతో మీ ముందుకు తీసుకురాబోతున్నా. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. నేనూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నా. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈనెల 17 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టాం. మరో మూడు నెలల పాటు చిత్రీకరణ ఇక్కడే జరుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో ఫారిన్‌ షూట్‌కు వెళ్లిపోతాం. నవంబరు, డిసెంబరు నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది వేసవి నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం’’ అన్నారు. ‘జాన్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.