‘రెడ్‌’ సర్‌ప్రైజ్‌ చూశారా!

సుందరమైన ప్రదేశం ఇటలీలోని డోలమైట్స్‌ సముద్ర మట్టానికి 10 వేల  అడుగుల ఎత్తులో, మైనస్‌ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. అక్కడ హాలీవుడ్‌ చిత్రాలు తప్ప, తెలుగు సినిమాల చిత్రీకరణలు జరగలేదు. తొలిసారి రామ్‌ ‘రెడ్‌’ బృందం అక్కడికి వెళ్లింది. డోలమైట్స్‌తో పాటు టుస్‌కానీ, ఫ్లారెన్స్‌ తదితర ప్రాంతాల్లో నాయకానాయికలు రామ్‌, మాళవిక శర్మలపై రెండు పాటల్ని చిత్రీకరించారు. ‘రెడ్‌’ బృందం అక్కడ చిత్రీకరణ పూర్తి చేసుకుని, తిరిగొచ్చిన వారం రోజులకే అక్కడ కరోనా వైరస్‌ కలవరం మొదలైంది. ఇటలీలో చిత్రీకరించిన ‘నువ్వే నువ్వే’ పాట మేకింగ్‌ వీడియో విడుదల సందర్భంగా ఆ విషయాల్ని చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్‌ గుర్తుచేసుకున్నారు. ‘‘మా దర్శకుడు కిషోర్‌ తిరుమల కోరిక మేరకే పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లాం. అక్కడ బెర్‌గామోకి సమీపంలోని లేక్‌ గార్డాలో ‘నువ్వే నువ్వే’ పాటని చిత్రీకరించాం. ఇప్పుడు ఆ ప్రాంతం కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది. మన దగ్గర కూడా కరోనా తీవ్రత ఉంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరాక ‘రెడ్‌’ విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు స్రవంతి రవికిషోర్‌. ఈ చిత్రంలో రామ్‌ సరసన మాళవికతో పాటు నివేదా పేతురాజ్‌, అమృత అయ్యర్‌ నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.