నాలుగు స్తంభాలాటలో గెలుపెవరిదో!!

తెలుగు చిత్రసీమలో సంక్రాంతి పోరు మొదలుకావడానికి ఇరవై రోజుల ముందుగానే మరో థ్రిల్లింగ్‌ సమరం తెరలేవబోతుంది. నిన్నమొన్నటి వరకు ‘ప్రతిరోజూ పండగే’, ‘రూలర్‌’, ‘దబాంగ్ 3‌’ చిత్రాలతో ట్రయాంగిల్‌ వార్‌గా కనిపించిన క్రిస్మస్‌ పోరు ఇప్పుడు ‘దొంగ’ రాకతో నాలుగు స్తంభాలాటగా మారిపోయింది. మరి ఈ రసవత్తర పోరులో ఘన విజయం అందుకొనేది ఎవరో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. అయితే బలాబలాల పరంగా చూసినప్పుడు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి కార్తి ‘దొంగ’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ప్రతిరÁజూ పండగే’ చిత్రాలు. ఎందుకంటే ఈ ఇద్దరు యువ హీరోలూ ఇటీవలే వరుస పరాజయాలకు బ్రేక్‌ చెప్పి హిట్‌ ట్రాక్‌ ఎక్కిన ఊపులో ఉన్నారు. ఈ ఏడాదిలో తేజు ఇప్పటికే ‘చిత్రలహరి’తో ఓ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోగా.. తాజాగా కార్తి ‘ఖైదీ’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇక ఈ తమిళ హీరో చిత్రానికి కలిసొస్తున్న మరో రెండు అంశాలేంటంటే.. దర్శకుడి హిట్‌ ట్రాక్, కార్తి తన వదిన జ్యోతికతో కలిసి తొలిసారి నటిస్తుండటం. ‘దృశ్యం’ వంటి వైవిధ్యభరిత చిత్రాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ ‘దొంగ’ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంచనాలను పక్కకు పెట్టి చూస్తే మాత్రం వీటి కన్నా బాలకృష్ణ ‘రూలర్‌’ మరింత బలంగా కనిపిస్తుంది. ముందు నుంచి బాలయ్య - కె.ఎస్‌.రవికుమార్‌ల కలయికకు చిత్రసీమలో మంచి పేరుంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘జై సింహా’ మంచి హిట్‌గా నిలవడంతో ఇప్పుడీ చిత్రంపైనా మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. దీనికి తోడు బాలయ్యకు బీ, సీ సెంటర్లలో మంచి క్రేజ్‌ ఉండటం కూడా ‘రూలర్‌’కి కలిసొచ్చే అంశమే. ఇక ‘దబాంగ్‌ 3’ క్రేజ్‌ విషయానికొస్తే.. పై మూడు చిత్రాలతో పోల్చి చూసినప్పుడు కాస్త బలహీనంగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే బాలీవుడ్‌లోనే కాక సల్మాన్‌కు ఇక్కడ కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటం, ‘దబాంగ్‌’ సిరీస్‌కు ఇక్కడ సైతం మంచి క్రేజ్‌ ఉండటం ఆ చిత్రానికి కలిసొచ్చే అంశాలని చెప్పొచు. ఏదేమైనా ఈ నాలుగు చిత్రాలను బలాబలాల పరంతా ఎంత బేరీజులు వేసుకున్నప్పటికీ అంతిమంగా ప్రేక్షకుల మెప్పు పొందేది మంచి కథా బలమున్న చిత్రమే. మరి ఆ కథాబలం ఏ చిత్రంలో ఉందో? ఈ నాలుగు స్తంభాలాటలో గెలుపెవరిదో? తెలియాలంటే డిసెంబరు 20 వరకు వేచి చూడక తప్పదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.