ఆ హాలీవుడ్‌ చిత్రాల స్ఫూర్తితోనే ‘సాహో’..

‘సాహో’ రాక కోసం ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌ వంటి హిట్ల తర్వాత డార్లింగ్‌ నుంచి వస్తోన్న సినిమా కావడం.. దీనికి తగ్గట్లుగానే దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటం, శ్రద్ధా కపూర్‌ సహా పలువురు బాలీవుడ్‌ స్టార్లు ఇందులో చేస్తుండటం తదితర అంశాలతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ హైప్‌కు తగ్గట్లుగానే దర్శకుడు సుజీత్‌ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఇందులోని యాక్షన్‌ ఘట్టాలన్నింటినీ రెండు హాలీవుడ్‌ హిట్‌ చిత్రాల స్ఫూర్తితో తెరకెక్కించినట్లు తెలిసింది. ఇప్పటికే విడుదలైన రెండు ‘సాహో షేడ్స్‌’ను చూస్తే.. ఈ మూవీలో యక్షన్‌ సీక్వెన్స్‌కు ఎంతటి ప్రాధాన్యమున్నదీ ఈపాటికే అందరికీ అర్థమైపోయింది. వీటిని దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కనిపించబోయే యాక్షన్‌ సీన్స్, ఛేజింగ్‌ సన్నివేశాలపై రెండు హాలీవుడ్‌ చిత్రాల ప్రభావం ఉందట. ఇంతకీ అవి ఏంటంటే.. ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన ‘టెర్మినేటర్‌’, ‘జడ్జిమెంట్‌ డే’ చిత్రాలు. వీటి స్ఫూర్తితోనే ‘సాహో’ పోరాట ఘట్టాలను రూపొందించారట ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కెన్ని బేట్స్‌. ముఖ్యంగా ఈ చిత్రంలో.. ఎత్తైన కొండలు ఎక్కడం, నదులు దాటడం, బైక్‌ ఛేజింగ్‌ తదితర సన్నివేశాల్లో డార్లింగ్‌ అదరగొట్టేలా నటించారట. ఇవి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.