‘సాహో’ పోలీస్‌ను చంపాలనుకునేది ఎవరు?

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ చిత్రంలో అండర్‌ కవర్‌ కాప్‌గా నటించి మెప్పించారు బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌. ఇప్పుడాయన్ని చంపేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రణాళిక రచించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఓసారి అతనిపై హత్యాయత్నానికి ప్రయత్నించగా.. తీవ్రమైన గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో కాళ్లు కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అయినా కానీ, తనపై హత్యా ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. మరి అతన్ని చంపాలనుకోవడానికి కారణాలు ఏంటి? ఈ కుట్ర వెనకున్న ఆ రహస్య వ్యక్తులు ఎవరు? అన్నది తెలియాలంటే నీల్‌ నటిస్తోన్న కొత్త చిత్రం ‘బైపాస్‌ రోడ్‌’ వచ్చే వరకు వేచి చూడక తప్పదు. నీల్‌ నితిన్‌ సోదరుడు నమాన్‌ నితిన్‌ ముఖేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదా శర్మ, సుధాన్షు పాండే, షామా సికిందర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లోని విజువల్స్‌ చూస్తుంటే ఇదకొక మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందినట్లు అర్థమవుతోంది. నీల్‌ నితిన్‌ ఇందులో విక్రమ్‌ కపూర్‌గా కనిపించబోతున్నారు. ఆయన జీవితంలో అనుకోకుండా ఓ ప్రమాదానికి గురవడం. ఈ ఘటనలో ఆయన రెండు కాళ్లు కోల్పోవడం. మరోవైపు సారా అనే యువతి హత్యకు గురికావడం. దానికి కారకులు ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నాల్లో ఉండగా.. మరోవైపు విక్రమ్‌ను చంపడానికి ఓ ముసుగు వ్యక్తి ప్రయత్నిస్తుండటం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నేపథ్య సంగీతం కూడా దీనికి తగ్గట్లుగా ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. దీపావళి కానుకగా నవంబరు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.