‘ప్రభాస్‌ 20’ కోసం ‘బాహుబలి’ డే??

బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో సినీప్రియులకు యాక్షన్‌ హంగామానే రుచి చూపించిన ప్రభాస్‌.. ఇప్పుడు ఓ సరికొత్త ప్రేమకథను పరిచయం చేయబోతున్నారు. ‘జాన్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రానికి ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డార్లింగ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. ఆయన తల్లి పాత్రను బాలీవుడ్‌ సీనియర్‌ నాయిక భాగ్యశ్రీ పోషించనుండటం ఖాయమైంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీపైనా నిర్మాతలు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రభాస్‌ లక్కీడే రోజున విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుందట. ఇంతకీ ఆ తేదీ మరేదో కాదు.. డార్లింగ్‌ ‘బాహుబలి 2’ విడుదలైన ఏప్రిల్‌ 28. ఆ చిత్రం 2017లో ఇదే తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అందుకే సెంటిమెంట్‌గా ఇప్పుడీ కొత్త చిత్రానికి కూడా ఇదే తేదీని ఖాయం చేస్తే బాగుంటుందని నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్లు చిత్ర సీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో రూపొందించిన ప్రత్యేక సెట్లలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌ మార్చి వరకు భాగ్యనగరంలోనే జరగనుంది. ఆ తర్వాత చిత్ర బృందం ఫారిన్‌ షెడ్యూల్‌కు పయనమవనుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.