ఓటీటీలో ‘నిశ్శబ్దం’.. క్లారిటీ ఇచ్చిన కోన!!

‘‘సినిమా ఉన్నది సినిమా హాళ్ల కోసమే. అదే మా ప్రాధాన్యత కూడా’’ అంటూ ‘నిశ్శబ్దం’ చిత్ర విడుదలపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చారు కోన వెంకట్‌. ఇది ఆయన నిర్మాణ సారథ్యంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీస్‌తో కలిసి నిర్మించిన చిత్రం. అనుష్క ప్రధాన పాత్రలో నటించగా.. మాధవన్, షాలినీ, అంజలి, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. గత ఏప్రిల్‌ 2నే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రాన్ని నేరుగా ఓటీటీ మాధ్యమాల ద్వారా విడుదల చేయబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో ఈ విషయంపై తాజాగా ట్విటర్‌ వేదికగా స్పష్టతనిచ్చారు కోన వెంకట్‌. ‘‘సినిమా పట్ల మాకున్న అమితమైన ఆసక్తి, ప్రేమతో ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఎన్నో అవరోధాలు దాటుకొని ఈ స్థాయికి చేరుకునానం. మేము తీసిన సినిమా చూసి థియేటర్లలో ప్రేక్షకులు చూపించే స్పందనే మాకు స్ఫూర్తి, ప్రేరణ. ఆ అనుభూతిని మరేదీ భర్తీ చెయ్యలేదు. సినిమా ఉన్నది సినిమా హాళ్ల కోసమే. అదే మా ప్రాధాన్యత కూడా’’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు కోన. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.