మౌనం మాటతోటి ఊసులు ఏవో చెబుతోందే!

ఇటీవలే ‘సమ్మోహనం’ చిత్రంతో సినీ ప్రియుల్ని సమ్మోహన పరచిన సుధీర్‌బాబు.. ఇప్పుడు ‘నన్ను దోచుకుందువటే’’ అంటూ ప్రేమ ఊసులు పంచుకునేందుకు ముస్తాబవుతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరెక్కిస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రంతో ఆర్‌.ఎస్‌ నాయుడు అనే నూతన దర్శకుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. నభా నటేశ్‌ కథానాయిక. అజనీష్‌ లోకనాథ్‌ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘మౌనం మాటతోటి’’ అంటూ సాగే తొలిగీతాన్ని విడుదల చేశారు. ఆద్యంతం ఎంతో ఆకట్టుకునేలా ఉన్న ఈ చక్కటి ప్రేమ గీతానికి ప్రముఖ రచయిత శ్రీమణి సాహిత్యమందించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌లకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఓ సరికొత్త వినోదాత్మక ప్రేమకథతో సాగే ఈ చిత్రంలో సుధీర్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మేనేజర్‌గా సీరియస్‌ పాత్రలో కనిపించనుండగా.. అతన్ని అల్లరి చేసే గడుసరి అమ్మాయి సిరి పాత్రలో నభ వినోదం పంచబోతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబరు 13న ప్రేక్షకుల మందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.                      


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.