‘సైరా’లో స్వీటీ పాత్ర అంత పెద్దదా!!

‘‘రిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ, చరిత్ర మనతోనే మొదలవ్వాలి’’ అంటూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల చరిత్రలు తిరగరాసేందుకు దూసుకొస్తున్నాడు ‘సైరా’. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 151వ చిత్రమిది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రామ్‌చరణ్‌ దీన్ని నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాకు సంబంధించిన విశేషాలు ఒకొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా, కిచ్చా సుదీప్‌లతో పాటు స్వీటీ నాయిక అనుష్క కూడా ఓ ముఖ్య పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. తొలుత ఆమె ఈ చిత్రంలో కనిపించదని కేవలం వాయిస్‌ ఓవర్‌ మాత్రమే ఇచ్చిందని వార్తలొచ్చాయి. కానీ, వాస్తవం ఏంటంటే ‘సైరా’లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయిగా కీలక పాత్రను పోషించిందట. సినిమా ప్రధమార్థంలో, ద్వితియార్థాలలో దాదాపు 10 నిమిషాల సేపు ఆమె సందడి చేస్తుందట. సినిమాకు స్వీటీ పాత్ర కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పది నిమిషాలు అంటే అది అతిథి పాత్ర అనుకోవడానికి వీల్లేదు. ఒకరకంగా పెద్ద పాత్ర అనే అనుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో నయనతార చిరుకు భార్యగా కనిపించనుండగా.. తమన్నా ఆయనకు ప్రేయసిగా నటించినట్లు కూడా ఈ సందర్భంగా సురేందర్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.