‘సైరా’ కోసం ‘స్పైడర్‌మ్యాన్‌’ కెమెరాలు వాడారట!
బాక్సాఫీస్‌ వద్ద ‘సైరా’ హంగామా షరూ కావడానికి ఇంకెన్నో రోజుల సమయం లేదు. చిరంజీవి కలల ప్రాజెక్టుగా దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్‌లు నెట్టింట సందడి చేస్తుండగా.. ఈనెల 18 ప్రీరిలీజ్‌ వేడుకకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిత్ర యూనిట్‌ సైతం వరుస మీడియా ఇంటర్వ్యూలతో ‘సైరా’ విశేషాలను సినీప్రియులకు తెలియజేస్తోంది. తాజాగా ఈ చిత్ర ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సైరా’ పోరాట ఘట్టాల చిత్రీకరణకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు తెలియజేశారు. ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాలంటే ‘సైరా’ తనకు ఎంతో ప్రత్యేకమైనదని, ముఖ్యంగా ఈ మూవీ కోసం 1840ల కాలం నాటి వాతావరణాన్ని తిరిగి చూపించగలగడం చాలా సవాల్‌గా నిలిచిందని తెలిపారు. ఇక తెరపై అందరి దృష్టినీ ఆకర్షించబోయే ‘సైరా’ పోరాట ఘట్టాలైతే మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నాయని, వీటి చిత్రీకరణ కోసం ‘స్పైడర్‌మ్యాన్‌’ వంటి భారీ హాలీవుడ్‌ సినిమాలకు ఉపయోగించిన ఖరీదైన కెమెరాలను ఉపయోగించినట్లు వివరించారు.
  

‘‘సైరా’ అన్నింటికంటే పెద్ద సవాల్‌గా నిలిచింది యుద్ధ సన్నివేశాల చిత్రీకరణే. ముఖ్యంగా కదన రంగంలో గుర్రాలు 60 - 70 కి.మీ. వేగంతో పరిగెడుతుండగా.. వాటిని అంతే వేగంతో పరిగెడుతూ చిత్రీకరించడమన్నది మామూలు విషయం కాదు. ఒక్క టేక్‌ సరిగా రాకపోయినా దాన్ని మళ్లీ చిత్రీకరించడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుంది. అందుకనే దీనికోసం మేం ప్రత్యేకంగా సిద్ధమయ్యాం. హాలీవుడ్‌ చిత్రాలకు వాడే మూవీ ప్రో ఎక్సెల్‌ మౌంట్‌ కెమెరా, బ్లాక్‌ కామ్‌ ఏటివి, స్పైడర్‌ క్యామ్‌ వంటివి ఉపయోగించాం. ఏటివి వాహనంలో ఉంచి వాడే బ్లాక్‌కామ్‌ను వేగంగా సాగే యుద్ధ సన్నివేశాల కోసం ఉపయోగించాం. ఇక ‘స్పైడర్‌మేన్‌’ చిత్రాలకు వాడే ‘స్పైడర్‌క్యామ్‌’ణు యుద్ధ సన్నివేశాల్లో గుర్రాలు తలపడే సన్నివేశాలను చిత్రీకరించడానికి వాడాం. దీనికి ప్రత్యేకంగా వీటినే ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. గుర్రాలు అనూహ్య వేగంతో ఒకదానితో మరొకటి తలపడేటప్పుడు వాటిని దగ్గర నుంచి చిత్రీకరించలేం. ఒకవేళ ప్రయత్నిస్తే గుర్రాల వల్ల కెమెరా, దగ్గరలోని ఇతర పరికరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. అందుకే స్పైడర్‌ క్యామ్‌ను వాడాం. వీటిని ఎక్కువగా క్రికెట్‌ మ్యాచ్‌లప్పుడు చూడొచ్చు. తాడును ఆధారం చేసుకోని గ్రౌండ్‌లో పై నుంచి వేలాడుతూ చిత్రీకరిస్తుంటుంది. అదే పద్ధతిలో గుర్రాల పోరాట ఘట్టాలను చిత్రీకరించాం. చుట్టూ నాలుగు భారీ క్రేన్లను ఏర్పాటు చేసి ఈ స్పైడర్‌ క్యామ్స్‌తో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ పరికరాన్ని ప్రత్యేకంగా రష్యా నుంచి దిగుమతి చేసుకోని జార్జియా షూట్‌లో వాడాం’’ అని చిత్రీకరణ విశేషాలు చెప్పుకొచ్చారు రత్నవేలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.