‘సైరా’ని చూసి కూడా వెనక్కు తగ్గట్లేగా..

గోపీచంద్‌ బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సాహసానికి సిద్ధమయ్యారు. ఈ దసరా పోరులో చిరంజీవి ‘సైరా’కు పోటీగా తన ‘చాణక్య’ను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సినీప్రియులందరి చూపు అక్టోబరు 2 పైనే ఉంది. ఎందుకంటే చిరు కలల చిత్రం ‘సైరా’ విడుదలయ్యేది ఆరోజే. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ విజువల్‌ వండర్‌లా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లతో అవి మరింత రెట్టింపయ్యాయి. ఎప్పుడైతే ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తోందని చిత్ర బృందం నుంచి ప్రకటన వచ్చిందో.. అప్పుడే టాలీవుడ్‌లోని మిగతా చిత్రాలన్నీ అలర్ట్‌ అయిపోయాయి. చిరు చిత్రానికి సోలోగా దారిచ్చేసి దసరా రేసు నుంచి పక్కకు తప్పుకున్నాయి. అగ్ర హీరో వెంకటేష్‌ క్రేజీ మల్టీస్టారర్‌ ‘వెంకీమామ’ సైతం చిరు కోసమే తన సినిమాను వెనక్కు తీసుకెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, చిరుకు పోటీగా బాక్సాఫీస్‌ బరిలో నిలిచేందుకు గోపీచంద్‌ సిద్ధమయ్యాడు. ‘సైరా’ విడుదలైన మూడు రోజుల వ్యవధిలో తన కొత్త చిత్రం ‘చాణక్య’ను ప్రేక్షకులకు చూపించబోతున్నారు. అక్టోబరు 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అయితే ఇలా గోపీ.. చిరుతో పోటీ పడటానికి సిద్ధపడటం వెనుక మరో కారణమూ ఉంది. సెప్టెంబరు చివరి వారం నుంచే దసరా సెలవులు మొదలు కాబోతున్నాయి కాబట్టి బాక్సాఫీస్‌ వద్ద చిరు సినిమా ఉన్నా.. ప్రేక్షకులకు మరో సినిమా చూసుకునే ప్రత్యామ్నాయం కూడా ఉంటుంది. అందుకే చిత్ర బృందం సాహసం చేసి మరీ అక్టోబరు 5న రిలీజ్‌ డేట్‌గా ప్రకటించింది. గతకొంత కాలంగా సరైన్‌ హిట్‌ లేక సతమతమవుతున్న గోపీచంద్‌.. తన ఆశలన్నీ ‘చాణక్య’పైనే పెట్టుకున్నాడు. ఓ సరికొత్త స్పై థ్రిల్లర్‌ కథాంశంతో దర్శకుడు తిరు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.