ఆ పది పోరాట ఘట్టాల్లో ఇదే హైలైట్‌ అట!

విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ చిరంజీవి ‘సైరా’ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దాదాపు రూ.300 కోట్ల పై చిలుకు బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా చిత్ర దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘సైరా’లోని పోరాట ఘట్టాలకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ‘‘ఈ చిత్రంలో దాదాపు పది దాకా ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే పోరాట ఘట్టాలు ఉన్నాయి. ఇది పీరియాడికల్‌ చిత్రం కావడంతో అప్పటి వాతావరణాన్ని ఎంతో సహజంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌ తక్కువగానే వాడాం. ఇక పోరాట ఘట్టాల్లో అన్నింటి కంటే హైలైట్‌గా నిలిచేవి క్లైమాక్స్‌ ముందు వచ్చే యుద్ధ ఎపిసోడ్‌, విరామానికి ముందు వచ్చే అండర్‌వాట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌. క్లైమాక్స్‌ను జార్జియాలో చిత్రీకరించగా.. ఇంటర్వెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ను ముంబయిలోని ఓ భారీ స్విమ్మింగ్‌ పూల్‌లో తెరకెక్కించాం. అయితే క్లైమాక్స్‌ కన్నా టెన్షన్‌గా అనిపించింది ఈ అండర్‌ వాటర్‌ సీక్వెన్సే. దీన్ని చిరు, తమన్నా కొందరు ఫైటర్లపై చిత్రీకరించాం. దాదాపు నెల రోజుల పాటు అన్ని ఏర్పాట్లు చేసుకోని ఈ ఎపిసోడ్‌ చిత్రీకరణకు దిగాం. అయితే చిరంజీవిగారు అండర్‌వాటర్‌ సీన్‌ ఎంతవరకు చేయగలరు అనే సందేహం ఉండేది. కానీ, ఆయనకు ఈ సీన్‌ గురించి చెప్పగానే చాలా తేలికగా ‘చేసేద్దాం’ అనేశారు. ఆయనంతా ధీమాగా ఉన్నా మాకు మాత్రం లోపల కాస్త ఒత్తిడిగానే ఉండేది. ఆ పూల్‌లో షూట్‌ చేయడానికి ముందు ఆర్టిస్టులకు రెండు రోజులు శిక్షణ ఇవ్వాలని అక్కడి ట్రైనర్స్‌ చెప్పారు. చిరు మాత్రం ఒకరోజు ట్రైనింగ్‌ మరుసటి రోజే షూట్‌ స్టార్ట్‌ అనేశారు. ముందు ఇంగ్లీష్ ఆర్టిస్టులతో చేయాల్సిన సీన్లను పూర్తి చేసేశాం. తర్వాతి రోజు చిరుగారు ఉన్న సీన్లను షూట్‌ చేయడానికి సిద్ధమయ్యాం. అయితే చిత్రీకరణకు ముందు ఓ అరపూట ట్రైనింగ్‌ తీసుకుంటే బాగుంటుంది కదా అని చిరు సర్‌కు చెప్పాం. ఆయన మాత్రం అదేం అవసరం లేదు చేసేద్దాం అంటూ కూల్‌గా చెప్పేశారు. మాకు కాస్త భయంగానే ఉన్నా.. చిత్రీకరణ ప్రారంభించాం. మీరు నమ్మరు కానీ, మేము రెండు రోజులు పడుతుందేమో అనుకున్న ఆ ఎపిసోడ్‌ను ఒక్క పూటలో పూర్తిచేసి పారేశారు చిరు. ఇదంతా నటనపై ఆయనకున్న శ్రద్ధా, ఎలాంటి కష్టాన్ని అయినా దృఢంగా ఎదుర్కోని తీరాల్సిందేనన్న ఆయన సంకల్పం వల్లే సాధ్యమయ్యాయి. నిజంగా ఆ సీన్‌ ఎంత బాగా వచ్చిందంటే.. థియేటర్లో ప్రతి ప్రేక్షకుడూ విజిల్స్‌ కొట్టకుండా ఉండలేరు’’ అని చెప్పుకొచ్చారు సురేందర్‌ రెడ్డి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.