‘వాల్మీకి’లో ‘దేవత’ ఎందుకు వినిపించిందంటే..

‘‘నా పైన పందేలేస్తే గెలుస్తరు.. నాతోటి పందేలేస్తే సస్తరు..’’ అంటూ బాక్సాఫీస్‌ పోరుకు సిద్ధమైపోయాడు వరుణ్ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వాల్మీకి’. వరుణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. తమిళ హీరో అధర్వ కీలక పాత్రను పోషిస్తున్నారు. సెప్టెంబరు 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడదల చేసింది చిత్ర బృందం. ఇందులో వరుణ్‌ నటన, ఆయన సంభాషణల తర్వాత ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించింది వాల్మీకి ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌. దీనికి సంబంధించిన రొమాంటిక్‌ సన్నివేశాలు వస్తున్నప్పుడు బ్యాగ్రౌండ్‌లో ‘దేవత’ చిత్రంలోని శోభన్‌బాబు - శ్రీదేవిల సూపర్‌ హిట్‌ పాట ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’’ను రీమిక్స్‌లో వినిపించారు. సినిమాలోనూ వరుణ్‌ - పూజాలపై ఈ పాటను చూడొచ్చట. అయితే ఇప్పుడీ పాట సినీప్రియుల్లో కొన్ని సందేహాలు తట్టిలేపింది. మెగా హీరోల చిత్రాల్లో పాత పాటలను వినిపించే ఛాన్స్‌ వస్తే.. సాధారణంగా చిరంజీవి హిట్‌ గీతాలను వినిపించేందుకే దర్శకులు మొగ్గుచూపుతారు. కానీ, హరీష్‌ మాత్రం మెగా హీరో సినిమాలో శోభన్‌బాబు వినిపించాడు. ఇంతకీ దీని వెనుక ఏమైనా ప్రత్యేకమైన కారణముందా? అని ఆరా తీస్తే ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. చిత్ర కథ రిత్యానే ‘దేవత’ పాటను పెట్టాల్సి వచ్చిందని హరీష్‌ చెప్పినప్పటికీ వాస్తవానికి అసలు కథ మరొకటి ఉంది. సినిమాలో ఈ పాట వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ 1982 కాలంలో జరుగుతుంటుందట. అప్పటికి చిరంజీవి చిత్రసీమలో ఉన్నప్పటికీ ఆయనకు చెప్పుకోదగ్గ మ్యూజికల్‌ హిట్స్‌ లేవు. ఆ సమయానికి ఇండస్ట్రీలో మారుమోగుతున్న పాట ‘దేవత’లోనిది మాత్రమే. అందుకే చిరు పాట పెట్టాలని చూసినా ఆ అవకాశం లేక శోభన్‌బాబు పాటను పెట్టారట. ఇక మరో విశేషమేంటంటే.. ఇందులో వరుణ్‌ శోభన్‌బాబు ఫ్యాన్‌గా సందడి చేస్తాడట.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.