సోలోగా రానున్న ‘వెంకీమామ’

సరాకే రావల్సిన ‘వెంకీమామ’.. సెట్స్‌లో వెంకటేష్‌కి జరిగిన చిన్న ప్రమాదం కారణంగా ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విడుదలకు సరైన తేదీని ఎంచుకోవడంలో ఈ చిత్రానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించింది చిత్ర బృందం. కానీ, ఇప్పటికే ముగ్గుల పండగ రేసు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల.. వైకుంఠపురములో’, ‘దర్బార్‌’, ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలతో ఫుల్‌ అయిపోవడంతో క్రిస్మస్‌ సీజన్‌ వైపు దృష్టి సారించారు. కానీ, ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. క్రిస్మస్‌ బరిలో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందు పోటీ పడేందుకు నాలుగు చిత్రాలు సిద్ధమయ్యాయి. వీటిలో బాలకృష్ణ ‘రూలర్‌’, రవితేజ ‘డిస్కోరాజా’, సాయిధరమ్‌ తేజ్‌ ‘ప్రతిరోజూ పండగే’తో పాటు సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ సైతం రేసులో నిలిచాయి. అందుకే ఈ పోటీలో బరిలోకి దిగి వసూళ్ల పరంగా ఇబ్బంది పడే కన్నా.. సింగిల్‌గా వచ్చి కలెక్షన్లు దండుకునేందుకు ప్రణాళిక రచించాడు ‘వెంకీమామ’. అందుకే ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సెలవులు మొదలు కావడానికి ఓ వారం ముందుగానే థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేసుకున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబరు 13న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఆ వారమంతా ఆ చిత్రానికి పోటీనే లేనట్లవుతుంది. అయితే దీనిపై సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకటేష్‌ తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్న తొలి మల్టీస్టారర్‌ ఇది. వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తుండగా.. చైతూకి జంటగా రాశిఖన్నా కనిపించబోతుంది. ‘జై లవకుశ’ తర్వాత దర్శకుడు బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) నుంచి రాబోతున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.