అందుకే ఈ చిత్రానికి ప్రచారం చెయ్యట్లే..

న చిత్రాలకు వినూత్న రీతిలో ప్రచారం చేసుకోవడంలో విజయ్‌ దేవరకొండది ఓ ప్రత్యేక దారి. ‘అర్జున్‌రెడ్డి’ చిత్ర విషయంలో ముద్దు పోస్టర్‌ల వివాదాన్ని, ‘గీతగోవిందం’కు తన పాటపై వచ్చిన ట్రోల్స్‌ను తనదైన శైలిలో ప్రచార మార్గాలుగా ఎంచుకొని ఆశ్చర్యపరిచారు. ఇక ‘డియర్‌ కామ్రేడ్‌’ విషయానికొచ్చే సరికి మ్యూజికల్‌ ఈవెంట్స్‌ పేరుతో ఈ ప్రచార పర్వాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. కానీ, బాక్సాఫీస్‌ వద్ద దానికి దక్కిన ఆదరణ కాస్త నిరాశ పరిచింది. ఒకరకంగా విడుదలకు ముందు సినిమాపై అనూహ్యమైన అంచనాలను క్రియేట్‌ చేయడమే చిత్ర ఫలితం దెబ్బ కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి దీన్ని విజయ్‌ సీరియస్‌ తీసుకున్నాడో.. ఏమో కానీ, ఈసారి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ప్రచార విషయంలో అంత చురుగ్గా వ్యవహరించడం లేదు విజయ్‌. తాజాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవరకొండను ఈ విషయమై ప్రశ్నించగా ఆసక్తికరమైన జవాబిచ్చారు. ‘‘ఈ సినిమాకు పెద్దగా మాట్లాడకూడదని ముందే నిర్ణయించుకున్నా. కానీ.. ఇప్పుడు జనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మనం ఏం చేయకపోయినా సినిమా జనంలోకి వెళ్లడం గొప్ప విషయమే కదా. ఇదీ నాకొక కొత్త అనుభవాన్ని నేర్పింద’’న్నారు. ఇదే సమయంలో చిత్ర టైటిల్‌పై స్పందిస్తూ.. ‘‘వాస్తవానికి ఈ చిత్రానికి ‘ప్రియం’, ‘ముంబయి తీరం’ అనే టైటిల్స్‌ అనుకున్నాం. అవి మరీ 64ల కాలం నాటి పేర్లులా అనిపించడంతో ఆఖరుగా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’కు ఫిక్స్‌ అయ్యాం. ఇది కూడా కథలో నుంచి పుట్టిందే. అయినా టైటిల్‌ అందరికీ నచ్చినా.. నచ్చకున్నా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగా అవుతున్నాయి కదా. టైటిల్స్‌ ఎలా ఉన్నా ఓకే. చివరికి ‘ఎక్స్‌ వై జెడ్‌’ అని పెట్టినా తేడా ఉండదు. బకింగ్స్‌ అవుతున్నాయా? లేదా? అన్నదే ప్రధానం’’ అంటూ మరో ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. వినూత్నమైన ప్రేమ కథాంశంతో క్రాంతిమాధవ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.